మా గోడూ జర ఇనరాదె ..

తెలుగు నేల మీద గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఉద్యమాలకు ఇప్పటికీ తెర పడేటట్టు లేదు. రాజకీయ అభిప్రాయాలకు వేదికగా ఈ బ్లాగును వాడకూడదనుకున్నప్పటికీ తెలంగాణ వాదనకు అసలు అర్థమే లేదన్నట్టు, అసలు సమస్యే లేనట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడానికి ఈ విషయం మీద నోరు మెదపక తప్పడం లేదు. నిజానికి ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాల వెనుక వాస్తవాలను వివరుస్తున్నామంటూ ప్రకటించే బ్లాగులు కోకొల్లలు. ఐతే ఎవరి వాదాన్ని వారు వినిపించి అదే సత్యమని నిరూపించడానికి అంకెల గారడీ చేయటం, తిమ్మిని బమ్మి చేసి చూపించడం ఇంటర్నెట్ మీద పరిపాటైపోయింది. రాజకీయ, ఆర్ధిక, సామాజిక రంగాలన్నిటినీ ప్రభావితం చేసే ఒక పెద్ద మార్పును ప్రతిపాదించినప్పుడు దాని వల్ల లబ్ది పొందేవారికి, దాని వల్ల కొన్ని ప్రయోజనాలు కోల్పోయేవారికి ఘర్షణ జరగడం సహజం. నిజంగా నిబద్దత గలవారు అటువంటి పరిస్తితుల్లో తమకు వ్యక్తిగతంగా నష్టం జరిగినా న్యాయం వైపు నిలబడతారు. అందుకు కావలసిన ధైర్యం బహుషా చాలా మంది తెలుగు వారికి ఇంకా సమకూరినట్టు లేదు. అసలు ఈ సమస్య మూలాలను గమనిస్తే సంస్కృతి, భాషల మీద అవగాహన లేకపోవటం, సహశీలత లోపించడం, పక్కవారిని ఓర్వలేకపోవటం లాంటి (శ్రీ శ్రీ గారి మాటలు అక్షర సత్యాలు .. ఇది మనకు పుట్టుకతో వచ్చిన లక్షణం) లక్షణాల వల్ల తెలుగు జాతి ఎంతగా నష్టపోయిందో అర్థం అవుతుంది. తెలంగాణ పుట్టి పెరిగిన వాడిగా నేను గమనించిన కొన్ని వాస్తవాలను, ఈ సమస్యకు మూలమని నేను భావించే అంశాలను నిష్పాక్షికంగా ఇక్కడ వివరిస్తాను.

అ) ఏది తెలుగు? : భాషలు భౌగోళిక, సామాజిక కారణాల వల్ల ఎలా రూపాంతరం చెందుతాయో అర్థం చేసుకోకుండా తెలంగాణా యాసను, సంస్కృతిని కించపరచటం చాలా మంది తెలుగువారికి అలవాటే. ఈ జబ్బు ప్రధానంగా స్వచ్చమైన తెలుగు మాట్లాడతామని చెప్పుకొనే కొన్ని ప్రాంతాల వారికి మరీ ఎక్కువ. అసలు స్వచ్చమయిన తెలుగు ఇదీ అని చెప్పడానికి సరైన ఆధారం లేనప్పుడు ఇటువంటి భాషామదాంధులకు ఇటువంటి భావాలు ఎందుకో అర్థం కాదు. మన రాష్ట్రంలో యాస, మాండలికాలు ప్రతి జిల్లాలోను వేరు వేరుగా ఉంటాయన్నది కాదనలేని సత్యం. భౌగోళిక, సామాజిక పరిస్తితుల దృష్ట్యా మనుషుల అవసరాలకు అనుగుణంగా భాష, సంస్కృతి మారాయి. అటువంటి సహజ సిద్దమైన మార్పులకు స్వచ్చత పేరుతో స్థాయిని అంటగట్టడం మూర్ఖత్వం. ఇన్ని రూపాంతరాలలో నిజమైన తెలుగు ఏది అన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం ఉంటుందని అనుకోవడమే తప్పు. స్వచ్చత, రిఫైన్మెంటు లాంటి భావాలకు బానిసలమయ్యి మనకు ఎబ్బెట్టుగా అనిపించిన ప్రతిదానిని ద్వేషించడం విజ్ఞుల లక్షణం కాదు. మన పూర్వికులు ఇదే పని చేసి ఉంటే ‘తర్వాతి నాలుగు నెలలు చలి కాలం’ అని చెప్పటానికి ‘తదుత్తరమాస చతుష్టయంబు హిమ సమయంబు ‘ అని సామాన్యుడికి అర్థం కాని భాషలో చెప్పిన కోలా శేషాచల కవి వంటి వాళ్ళ సాహిత్యాన్నే ఇంకా అగచాట్లు పడుతూ ఆస్వాదించాల్సి వచ్చేది. గురజాడ, వీరేశలింగం వంటి సంస్కర్తలు మనలేకపోయేవారు.

భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం ఆంద్ర రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకంటే ఎక్కువగా పక్క రాష్ట్రాల సరిహద్దుల్ని ఆనుకొని వుంది. దీని వల్ల భాష ఎక్కువగా మార్పు చెందిన మాట వాస్తవమే. ఉర్దూ పదాలు ఎక్కువగా ప్రవేశించినంత మాత్రాన నిజాముల వల్ల పర భాష చేతిలో మన భాష అపవిత్రమైపోయిందనుకుంటే, ఎక్కువ శాతం సంస్కృత పదాలను అప్పు తెచ్చుకొని ద్రావిడ భాష అని చెప్పుకొనే తెలుగు భాష ఏ మేరకు పవిత్రమైనది? అదే భాషలో ద్రావిడ సంగీత సంపదకు తలమానికమైన పంచరత్న కీర్తనలు లేవా? .. ఈ కారణం చేత కర్ణాటక సంగీతకారులు ఆ గేయాలను చిన్నచూపు చూస్తున్నారా? ‘కర్ణానికి ఇంపయింది కర్నాటక సంగీతం’ అంటారు మన మంగళపల్లి బాలమురళికృష్ణ గారు .. స్వచ్చత, శాస్త్రీయత పేరుతో సంగీతాన్ని కట్టిపడేయెద్దు అంటారాయన. భారత దేశమే భిన్న సంస్కృతులను అక్కున చేర్చుకొని తన ఔన్నత్త్యాన్ని చాటింది. ఆ విశాల దృక్పథం లేని స్వచ్చత భాండశుద్ధి లేని పాకం లాంటిది .. తినడానికి ఎలా వున్నా దాని వల్ల అనర్థాలు తప్పనిసరి. అటువంటి విశాల దృక్పథం తెలుగు వారందిరికి అలవడుతుందని, తమకు నచ్చనిదల్లా హేయమైనదని నమ్మే సంకుచిత దృక్పథం గలవారికి కనీసం ఇప్పుడైనా కనువిప్పు కలుగుతుందని ఆశిద్దాం.

గమనిక : నిజానికి గోదావరి జిల్లాల ‘అలాగ, అండీ, ఆయ్’ భాషనీ, శ్రీకాకుళం ‘ఏటయినాది, పోనాది, గందా’ భాషనీ ఇదే రకంగా చూస్తామని నాకు తెలుసు. ఐతే ఈ సమస్య తెలంగాణ యాస విషయంలో మరీ ఎక్కువ. వికృతి పదాలు ప్రవేశించిన భాషని వాడడానికి మనకు నామోషి .. వాడిన వాడిని ‘ఊరోడు’ అని కించపరుస్తాం .. అదే ఇంగ్లీష్ స్లాంగ్ ని మాత్రం ‘కూల్’ అనేస్తాం .. ‘ఫక్/షిట్’ లాంటి పదాలు ఊతపదాలు అయిపోతాయి. మన పాఠ్య పుస్తకాలలో, సాహిత్యంలో, సినిమాలలో అన్ని యాసలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవటం ఇందుకు పాక్షిక కారణం కావచ్చు. ఆ లోపాన్ని శక్తి మేరకు నిర్మూలించడానికి తెలుగు యువ కిశోరాలు ప్రయత్నించగలరని మనవి.

ఆ) ప్రగతిశీలత ? : తెలంగాణా ప్రాంత వెనుకబాటుకు మా తప్పేమిటి అని బయటి వారు ప్రశ్నించటంలో తప్పు లేదు. కాని వారి వెనుకబాటుతనానికి వారే కారణం, విభజన వల్ల అసలు వారికి ప్రయోజనమే లేదు అనటం వాస్తవాలను విస్మరించడమే. ఇలా వాదించేవారు తరచుగా తెలంగాణా వారిని అందరినీ ఒకే గాట కట్టి ‘వాళ్ళు కష్టపడరండీ!!’ అనడం చాలా సార్లు చూసాను. అసలు అటువంటి వ్యాఖ్యలోనే వారికున్న దురుద్దేశం కనిపిస్తుంది. కష్టపడే తత్వం, తెలివి ఒకరి సొత్తు కాదు. నిజాముల నుండి వారసత్వంగా సంక్రమించిన నవాబీ అలవాట్ల వల్ల మొదట్లో ‘కౌలు సంస్కృతి’ ని చాలా మంది తెలంగాణా రైతులు పాటించిన మాట వాస్తవం. కాలక్రమంలో వారి అలవాట్లు మారాయి .. తమ భూమిని వాడుకొని పైకి ఎదిగిన బయటి వారినుండి చూసి నేర్చుకొన్నారే తప్ప వారి మీద పడి దోచుకోలేదు. విద్యారంగంలో సైతం క్రమంగా చాలా మెరుగుదల జరిగింది. జరిగిన తప్పును సరిదిద్దుకొని ప్రగతి వైపు సాగే ప్రయత్నంలో భాగమే ఈ రోజు ఈ విభజన డిమాండు.

విభజన ఎందుకంటారా? దైవదత్తమైన ప్రకృతి/జల సంపదల పంపిణీలో తెలంగాణాకు అన్యాయం జరిగిందన్నది ఎవరూ కాదనలేని సత్యం .. అది జరిగిన రోజు ఇక్కడి ప్రజలు విద్యాపరంగా వెనకబడటంవల్లనో, ఇక్కడి రాజకీయ నాయకుల చేతగానితనంవల్లనో ఇది జరిగి ఉండవచ్చు .. కాని దాంతోపాటు తెలిసీ అటువంటి అన్యాయాన్ని దగ్గరుండి జరిపించిన ఆంద్ర నాయకుల పాపమూ ఉంది. ఇందులో ఆంద్ర ప్రాంత ప్రజల తప్పు లేకపోవచ్చు .. కాని ఇప్పటికి ఆ తప్పు సరిదిద్దవద్దనటం భావ్యం కాదు. అలాగే విద్యాపరంగా వెనుకబడిన పాపానికి తెలంగాణాకు జరిగిన నష్టం రోజు రోజుకూ మరింత ఎక్కువవుతున్నదే తప్ప తగ్గడం లేదు. విద్య వల్ల ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగాలు, డబ్బు, స్థాయి .. వాటి వల్ల అధికారం .. దాని వల్ల మరింత ప్రగతి సాధించే అవకాశం .. ఇవన్నీ ఎల్లకాలమూ ఆంధ్ర ప్రాంత ప్రజల చేతిలోనే అధికంగా ఉండిపోయే ప్రమాదం కచ్చితంగా ఉంది. (నేను ఇక్కడ ఆంధ్ర వారిని తప్పుబట్టడం లేదు .. విద్యలోని అంతరాల వల్ల మిగిలిన అంతరాలు ఎలా పెరిగాయో/పెరుగుతున్నాయో వివరిస్తున్నాను) . అటువంటి అంతరాలు తగ్గించడానికి తెలంగాణా ప్రాంత అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక విధానాలు ప్రభుత్వం చేపట్టాలి, ఇక్కడి విద్యావ్యవస్థను పటిష్టం చేసి, ప్రభుత్వ ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం కలిగించాలి. (ఉద్యోగాలలో ప్రాతినిధ్యం మాట కొందరికి మింగుడు పడదు .. ఇందులో ప్రతిభకు అన్యాయం జరుగుతుంది అని వాదించడంలో పైకి న్యాయం కనిపించినా తమ ఉద్యోగాల్లో కోత ఉంటుందనే భయం వ్యతిరేకతకు ప్రధాన కారణం .. ఇందాక చెప్పినట్టు మనకు నష్టం జరిగినా న్యాయం వైపు మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి .. అది లేనప్పుడు ఈ వాదనను వ్యతిరేకించడానికి సవా లక్ష కారణాలు వెతకవచ్చు .. వాటిలో నిజాయితీ మాత్రం ఉండదు. రిజర్వేషన్ల మాదిరే ఇదీనూ!!). పైన చెప్పిన అభివృద్ధి పనులకు కావలసిన నిధులు, రాజకీయ ప్రక్రియ సమైక్య రాష్ట్రంలో సాధ్యం అయ్యే అవకాశం తక్కువ. ఒక వేళ అలా జరిగినా అవి సరిగా అమలు జరగవు అన్నది చరిత్ర నేర్పిన పాఠం. ఇందు వల్ల విభజన అవసరం.

ఇది అభివృద్ధి కోసం, తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఒక ప్రాంత ప్రజలు చేస్తున్న కన్నీటి పోరాటమే కాని మరొకరి మీద అక్కసుతోనో, వారి ఆస్తుల మీద ఆశతోనో చేస్తున్న పోరాటం కాదు.

ఇ) మరి ఆస్తుల మాటో? : హైదరాబాదుకు అన్ని ప్రాంతాల ప్రజలు చేసిన మేలుని, వలస వచ్చిన వారు తెలంగాణా ప్రాంత అభివృద్ధికి పాటుపడిన విషయాన్నీ ఎవ్వరూ విస్మరించలేరు .. ఐతే విభజన కోసం జరిగిన ఉద్యమంలో కొందరు నీతి లేని నాయకులు ఉద్యమం ఎలా నడపాలో తెలియక ‘తరిమేస్తాం, కాలుస్తాం, కూలుస్తాం’ అని బయటి వారిలో భయాన్ని, తెలంగాణాలో ప్రజల్లో బయటివారి మీద ద్వేషాన్ని నింపిన మాట వాస్తవం. అటువంటి వారి చేతిలో ఉద్యమం పక్క దారి పట్టకుండా చూడవలసిన బాధ్యత తెలంగాణా మేధావుల మీద ఉంది. అలాగే ఇక్కడి ప్రజల ఆకాంక్షలను గుర్తించి విభజన ప్రక్రియకు సహకరించిడం బయటి వారి బాధ్యత. అభిప్రాయాలు చెప్పినందుకు ఒకరిని హింసించడానికో, ఈ భూమి మాది అని మరొకరిని తరమడానికో మన రాజ్యాంగమే అంగీకరించదు. ఉద్యమం హింసాత్మకంగా మారడాన్ని వివేకవంతులెవరైనా వ్యతిరేకిస్తారు. ఐతే ఇది సమైక్య ఉద్యమానికి కూడా అంతే వర్తిస్తుంది. తెలంగాణా ఆవిర్భావం వల్ల కేవలం పరిపాలన, రాజకీయ మార్పులు తప్ప మరే అవాంచిత సంఘటనలు జరగవన్నది నా నమ్మకం. అటువంటి భయాలను తొలగించే బాధ్యత ఉద్యమకారులదే!! (ఈ విషయమై నేను అనేక మంది మేధావులకు, విద్యార్థులకు లేఖలు వ్రాసాను. అందరూ ఇందుకు అంగీకరించారేగాని కాదంటూ విషం కక్కలేదు).

తెలుగు వారంతా బందులు, ఆత్మహత్యలు మాని భారత ప్రభుత్వం ప్రకటించిన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ మీద నమ్మకముంచి దానికి అందరూ సహకరించవలసిన సమయమిది. విశాల హృదయాలతో ఆ ప్రక్రియ అనివార్యమయిందని సీమాంధ్ర ప్రజలు, అందులో భాగంగా అందరి మాట వినవలసిన అవసరం ఉందని తెలంగాణా ప్రజలు గుర్తిస్తారని, ఆ ప్రక్రియ జరిగే సమయాన్ని తిరిగి తెలుగు నేలను అభివృద్ది వైపు నడిపించడానికి ఉపయోగిస్తారని ఆశిద్దాం.

3 స్పందనలు to “మా గోడూ జర ఇనరాదె ..”

  1. bondalapati అన్నారు:

    తెలంగాణా వాదం వైపు నుంచీ చాలా సమతుల్యత ఉన్న ఒక వ్యాసాన్ని రాసినందుకు మీకు అభినందనలు.
    సమైక్య రాష్ట్రం లోని తెలంగాణ లో, విద్యా వ్యవసాయ విషయాల లో కొంత అభివృధ్ధి జరిగిందని మీరే ఒప్పుకొన్నారు. తెలంగాణ వస్తే ఇంతకంటే అభివృధ్ధి జరిగుతుంది అనేదానికి ఏదైనా ఆధారం ఉంటే నా వోటు ప్రత్యేక తెలంగాణ కే.
    మీరన్నట్లు “….తమకు వ్యక్తిగతంగా నష్టం జరిగినా న్యాయం వైపు నిలబడతారు…” అనే విషయం తో నేను ఏకీభవిస్తున్నాను. ఐతే మీరు “వ్యక్తిగతం గా మనకు నష్టం లేనప్పుడు ఎదుటి వారి వ్యక్తిగత లాభాన్ని ఒదులు కోమని చెప్పటం చాలా సులువు” అని కూడా చెప్పినట్లైతే పరిపూర్ణం గా ఉండేది.
    చాలామంది ఆంధ్ర ప్రజలకు,ముఖ్యం గా హైదరాబాదు లో ఆస్థులు లేని వారికి, వ్యక్తిగతం గా తెలంగాణా ఏర్పడటం వలన నష్టం ఏమీ లేదు. తెలంగాణ కూ ఆంధ్ర కూ భాష గురించిన అభిమానం లో కొంచెం తేడా ఉంది. మొదట ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్యమైన కారణం భాషాభిమానం ఆధారం గా ఈ ప్రాంతం లో చేసిన ఉద్యమాలు. ఆ ఉద్యమాల వలన ఈ ప్రాంత ప్రజలలో భాషా స్పృహ కొంచెం ఎక్కువ. సామాన్య ప్రజలు సమైక్య వాదాన్ని బలపరచటానికి, ఇది ఒక ముఖ్య కారణం. తెలంగాణ లో ఈ ఉద్యమాలు జరిగిన దాఖలా లు లేవు. దాని వలన కావచ్చు తెలంగాణ లో భాషా స్పృహ తక్కువ.
    ఆంధ్ర తెలంగాణ ప్రజలలో టెంపరమెంట్ పరం గా కూడ కొన్ని వైరుధ్ధ్యాలున్నాయి. దీనికి కారణం ఆయా ప్రాంతాల చరిత్ర (నిజాం లు ఒక వైపు బ్రిటిష్ వరు ఇంకొక వైపు) కావచ్చు.

  2. Ramesh అన్నారు:

    Excellent.

  3. Ramesh అన్నారు:

    తెలుగు తెలుగంటాం కానీ …. అందులో ఇంగ్లీష్, సంస్కృత పదాలే కదా ఎక్కువగా ఉపయోగించేది.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )


Follow

Get every new post delivered to your Inbox.