“ఈ రాష్ట్రమేదో తొందరగా ఇచ్చేస్తే బావుండును .. ఈ గొడవలతో యాష్టకొస్తుంది!! మొన్న నరసారెడ్డి సారు దీక్షకు కూర్చోబోతే ‘నువ్వు ఒక రోజు స్కూల్ బందు పెట్టమంటే నసిగావు. నువ్వు ఆంధ్రోడివి .. నీ దొంగ దీక్ష అవసరం లేద’ ని పంపేసారట. ఇలా సపోర్ట్ చేసే వాళ్ళని నారాజ్ జేసి వెనక్కి పంపితే ఎట్లా!!” .. అమ్మ గొంతులో ఉన్నది బాధో అసహనమో తెలియలేదు. ఆమె భాషలో అలవాటుగా దొర్లిన ఇక్కడి పదాలు మాత్రం ఆమె అవస్థకు అద్దం పడుతున్నాయి. అమ్మ పుట్టి పెరిగింది మా జిల్లా (నిజామాబాదు) లోనే .. చదువు వరంగల్ లో .. తన పూర్వికుల ప్రాంతమని చెప్పుకొనే కృష్ణా జిల్లా ఎలా వుంటుందో కూడా తెలియదు తనకి (అమ్మకు ముందు మూడు తరాల క్రితం వచ్చారిక్కడికి వాళ్ళు). ఇక్కడికి తరలి వచ్చిన చాలా మందిలానే భాష, యాస మారకపోయినా ఇక్కడి నేలతో ఉన్న అనుబంధం ఆమెలో స్పష్టం గా కనిపిస్తుంది.
“ఎన్ని ఉద్యమాల్లో మనం పాల్గొన్నా మన పరిస్థితి ఇంతేలే .. భాష కాకపోతే ఇంకొకటి పట్టుకొని వేరు చేస్తారు!! పుట్టి పెరిగిన నేలలోనే బయటి వాళ్ళం అవ్వాల్సి వస్తోంది. ఎక్కడికైనా వెళ్ళిపోదామా అంటే మనది అనదగ్గ చోటే లేదు. విజయవాడలో ఒక పూట తిండి పెట్టేవాడు లేదు. ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కదా ఎలా ఉన్నారని ఒక్క ఫోన్ చెయ్యలేదు మన బంధుగణం. మళ్లీ ‘నైజామోళ్ళు’ అని ఒక బిరుదు మనకి. అయినా దోస్తులు, పార్ట్నర్లు ఇక్కడి వాళ్ళు ఐతే ఇక ఎక్కడికని వెళతాం” .. నాన్న మాటల్లో అంత నిర్లిప్తత నేనెప్పుడు చూడలేదు. ఎంత తెలంగాణ మీద మమకారం ఉన్నా ఇలాంటప్పుడు ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే భయం ఎప్పుడు ఉండేదే ఆయన మనసులో. నాన్న చెన్నారెడ్డినాటి ‘జై తెలంగాణ’ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్న మనిషి. ఆయనకు బహుషా అమ్మకన్నా ఎక్కువ బాధ ఉంది కాబోలు. వాళ్ళ దగ్గర ఉండి చూసుకోలేను కనుక నాకూ కొంత భయమే.
“మనం ఇక్కడి వాళ్ళమని అందరికి తెలుసులే నాన్నా!! మరీ ఎక్కువగా గొడవలైతే షిఫ్ట్ అవుదాంలే!!” నాకు నేను ధైర్యం చెప్పుకునేందుకు ప్రయత్త్నిస్తూ నాన్నతో అన్నాను.
మా మాటలు వింటున్నాడు కాబోలు పెరుమాండ్లు తాత వాకిట్లోంచి ఇంట్లోకి వచ్చాడు .. ” ఈ పెరుమాండ్లు ఏమి కీడు చేసిండని ఎల్లిపోతవు బిడ్డా!!” గద్గద స్వరంతో నాన్నతో అన్న ఆ ఒక్క మాటలో ఎన్నో భావాలు .. నాన్నకు, ఆయనకు కళ్ళలో నీళ్ళే తక్కువ!!
ఆంద్ర రాష్ట్ర అవతరణకు ముందు వలస వచ్చిన మా తాతయ్యకు, పెరుమాండ్లు తాతకు స్నేహం ఎలా కుదిరిందో నాకూ తెలియదు గాని నాకూ ఊహ తెలిసిన దగ్గరి నుండి తాతయ్య, తాత ఇద్దరూ ఒక్కటే మా ఇంట్లో. మా ఇళ్లూ పక్క పక్కనే. నాన్న తాతను పేరుకు కాకా అని పిలిచినా సొంత చిన్నాన్నలా చూసేవాడు. తాతయ్య, తాత ఇద్దరూ మాట్లాడుకునే పిచ్చాపాటి మాటలు నేను శ్రద్దగా ఆలకించేవాడిని. కాలక్రమంలో తాతయ్య ముందు నిష్క్రమించారు. పెరుమాండ్లు తాత కొడుకులు బ్రతుకు సమరం కోసమని వేరే ఊళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. తాత, నర్సవ్వ ఆయికి జీవిత చరమాంకంలో ఆప్యాయతన్నది కరువయ్యింది. అందుకే కాబోలు నాన్నను బిడ్డా అని పిలుచుకొంటాడు. మనుషుల మధ్య కులం, భాష, సంస్కృతిలాంటి గోడలు ఎందుకు ఉన్నాయా అనిపిస్తుంది వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు.
“అది గాదె తాత!! ఈడ లొల్లి పెద్దగ ఐతే నాయినకు తక్లీఫ్ ఐతది .. నేను దూరం ఉంటి!! .. రెండొద్దుల దాక ఈడ లేకుంటే .. అన్ని మంచిగయినంక మల్ల పంపిస్త” తాత బాధపడుకుండా చెప్దామని ప్రయత్నించాను.
“నీ బోటి బిడ్డలు మా ఇంట లేకపోతిరి .. మూలకు పారేసి, ఇన్ని పైసలు ఇచ్చి ఎవ్వని దారి ఆడు బట్టిండు!!” అన్నాడు పెరుమాండ్లు తాత ” ఐన బిడ్డా .. ఈడ తెలంగాణ మందిల మీ నాయినకున్న పేరు ఎవ్వనికి లేదు, లొల్లిలు ఐతే పాతూరుకెల్లి మీ నాయిన దోస్తులు ఉరికి రారు? నేను ఈడనే ఉన్న .. నీకు ఫికరేమిటికి? “. తాతకున్న నమ్మకం వాస్తవానికి దగ్గరగా ఉంటే ఎంత బావుండు అనుకున్నా నేను.
“లొల్లి ఐనప్పుడు గవన్ని ఎవ్వనికి యాదుండయి తాత .. ఆగం చేసెటోల్లు మనకి యాడ ఇంటరు” మనసులో భయం చెప్పాను.
ఈ సరి సమాధానం ఆయి ఇచ్చింది “ఇంద్ల యాదుండనీకి ఏమున్నది !!.. మీ తాత ఈడికి అచ్చినప్పుడు ఇదే లొల్లి నడుస్తుండె .. గిప్పుడు రెండు తరాలు నడిసిపాయె .. మా బిడ్డలలెక్కనే మీ నాయిన, నువ్వు ఈడనే మా కండ్ల ముందు పెద్దగ అయ్యిండ్రు!! మిమ్ములను ఎల్లగొడితే తెలంగాణ తల్లి పేగు దెంచినట్టుగాదు?”.
అందరు మౌనంగా ఉండిపోయారు .. ఆమె మాటకు సమాధానం మా దగ్గర లేదు మరి !!
… ఒక వెనుకబడిన ప్రాంతపు పోరాటాన్ని.. ప్రాంతీయ విద్వేషాగ్నిగా, ఒక మహానగరం కోసం కీచులాటగా మార్చిన మన నేతలకు నిజంగా సామజిక స్పృహ ఉందో లేదో నాకూ తెలియదు.. పెరుమాండ్లు తాతకున్న మానవీయ విలువలు, ఆయికి ఉన్న వివేకం వారికి ఉంటే ఈ పాటికి తెలంగాణ చాలా ముందు ఉండేది. కనీసం ఇప్పుడైనా అది జరుగుతుందని నా ఆశ.
గమనిక : నేను తెలంగాణ మద్దతుదారుని (మాత్రమే). పుట్టిన నేల అభివృద్ధిని కాంక్షించడం చాలా సహజం, న్యాయం. దయ చేసి నా అభిప్రాయాలను ఏ ప్రాంతానికి (ముఖ్యంగా ఆంద్ర, రాయలసీమ) వ్యతిరేకమని అర్థం చేసుకోవద్దని మనవి. ఈ కథ తెలంగాణ ప్రాంతంలో చాలా ఏళ్లుగా ఉంటూ భాష వల్ల వేరుగా చూడబడుతూ, అలాగని పుట్టిన నేల మీద ఇష్టాన్ని చంపుకోలేక, మరొక చోటికి వెళ్ళలేక .. వివక్షకు అభిమానానికి మధ్య నలిగిపోతున్న ఒక అల్ప సంఖ్యాక వర్గం ( వారిని సెటిలర్లు అని ఒక పదంతో పిలుస్తుంటారు .. నాకా పదం నచ్చదు కాబట్టి వాడలేదు) పడుతున్న అవస్థను, తెలంగాణ వాసుల మధ్యనున్న సున్నితమైన సామాజిక బంధాలను చిత్రీకరించటానికి చేసిన ప్రయత్నం. దయ చేసి తిట్లు, శాపాలు, రాజకీయ అభిప్రాయాలు వంటివి వ్యక్తీకరించడానికి కామెంట్స్ ను వాడవద్దు. నిష్పాక్షిక అభిప్రాయాలు, విమర్శలు వగైరాలకు స్వాగతం
3:27 అపరాహ్నం వద్ద జనవరి J, 2010 |
చాలా చాలా బావుందన్నా!
గత మూన్నెళ్ల నుండి జరుగుతున్న ఉద్యమాలలో దెబ్బతిన్న మానవ సంభందాలు ఇప్పుడిప్పుడే కోలుకోవు.
4:51 అపరాహ్నం వద్ద జనవరి J, 2010 |
విచక్షణ మరిచిపోయిన కొంతమంది ఉద్యమకారులు ఆంధ్ర అనే పదం కనిపించినా వినిపించినా సదరు వ్యక్తుల మీద, వాహనాల మీద దాడికి దిగినపుడు నాకు మీకు కలిగిన బాధే కలిగింది.
5:44 అపరాహ్నం వద్ద జనవరి J, 2010 |
Very nicely written. Touching.
5:44 అపరాహ్నం వద్ద జనవరి J, 2010 |
ఒక రెండు నెలలు ఢిల్లీ కి పట్కపో.. అదే బెటర్ అనుకుంట.. జనాలకి ఎప్పుడు ఏం దూల పుడ్తదో ఎవడికి తెల్సు.. ఈ సంఘటనల వల్ల తెలంగాణా పై నీ అభిప్రాయాన్ని మార్చుకోకపోవడాన్ని అభినందిస్తున్న.
10:15 పూర్వాహ్నం వద్ద జనవరి J, 2010 |
లైట్ రా … పరిస్తితి మరీ దారుణంగా ఉండదని ఆశిస్తున్నా .. వయొలెన్స్ జరిగితే సెంటర్లో సపోర్ట్ తగ్గుతుందని ఎవ్వడికి అర్థం కావట్లేదు!! పనులు, చదువులు వదిలేసి రోడ్ల మీద తిరిగటం కన్నా పొలిటికల్ ప్రెజర్/డిబేట్ పెట్టటం అవసరం.
.
ఐన ఇప్పుడు నేను వెళ్ళిపోతే నా సోషల్ చేంజ్ డ్రీమ్స్ కి బొక్క !! ఇలాంటి భయాన్ని ఎదుర్కోకపోతే ఇంకేమి పీకగలను .. అసలు స్టొరీ రాసిందే మన జనాలకు కొంత సెన్స్ వస్తుందేమో అని
7:00 అపరాహ్నం వద్ద జనవరి J, 2010 |
ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి నివసించే హక్కు ప్రతీ భారత పౌరుడికి ఉంది. పరిస్ధతిని బట్టి జాగ్రత్తగా మెలగండి.
11:28 పూర్వాహ్నం వద్ద జనవరి J, 2010 |
మీరు చెప్పింది నిజమే!! కానీ ప్రాంతీయ భావాలు పక్క వారి మీద ద్వేషం గా మారినప్పుడు అవన్నీ ఎవరికీ గుర్తు ఉంటాయి? సహనమూర్తులమని చెప్పుకుంటూనే మరొకరి మీద విషం కక్కడం మన దేశమంతా ఉన్నదేలే.. ఇలా జరుగుతుందని ఒక న్యాయమైన డిమాండుకు మద్దతు తెలపకుండా ఉండలేం కదా .. తెలంగాణ విషయంలో అది జరగకూడదనే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాను.
12:17 పూర్వాహ్నం వద్ద జనవరి J, 2010 |
మానవ సంబంధాలు ప్రాంతల వారీగా వేరుగా వుండవు అన్నదానికి మీ భావన దగ్గరగా వుంది. ఆ తాత, ఆయి లాంటివారే ఎక్కువగా వుంటారు. మీ రాశించిన మంచి జరగాలని కోరుకుంటూ..
4:02 పూర్వాహ్నం వద్ద జనవరి J, 2010 |
నీ ఇంటిపక్కవారికి, నీ స్నేహితులకి నీ నిజాయితీమీద నమ్మకంలేదంటే నీ బ్లాగుడు జస్ట్ అబద్దాల వాగుడనిపిస్తుంది. ఇంతవరకూ అనవసరపు దాడులు జరగలే. నాగురించి చెప్తావిను. నేనుండేది హైద్రాబాద్ లో.నా పక్క రూముల్లో అంతా ఆంధ్రోల్లు. నేను ఉద్యమం గూర్చి పట్టించుకోలే. మా ఆంద్రోల్ల వెటకారం మాటలు. నాకన్నా (బహుశా కెసియార్ కన్నాకూడా ఎక్కువేమో) ఎక్కవగా రోజంతా తెలంగాణా గూర్చి చర్చలు. పెద్దగా నవ్వులు. ఒపెన్ గానే తెలంగాణా వాళ్ళు ముఖ్యంగా యూనివర్సిటీ స్టూడెంట్స్ ని చెత్తనాయాల్లని కామెంట్స్. ఫలితం నా స్వరం పెరిగింది. వాళ్ళ నోళ్ళు మూతలు పడ్డాయ్. ఆతర్వాత ఎక్కడ ఎవడి నోరు తెలంగాణాకి వ్యతిరేకంగా వినిపించినా నా చేయి లేచింది. ఇప్పుడు చెప్పు దోపిడీ ఎవరిది. ఆశ్రయం ఇస్తే మిస్ యూస్ చేసిందెవరు. ఇంత జరిగినా ఇంకా బుద్ది మార్చుకోనిదెవరు. నీ పక్కన ఉన్నవాళ్ళు నీ నిబద్దత గూర్చి డౌట్ పడ్డారంటే నీదే తప్పు. నువ్ వాళ్లు నిన్ను నమ్మేలా బివేహ్ చేయలేదు. తెలంగాణాలో ఇన్నాళ్ళు ఉన్న నీలాంటి వాళ్ళకు తప్పక రక్షణ ఉంటుంది. ఉద్యమం ఇంకా హింసా మార్గం పట్టలేదు. పట్టినా నీలాంటివాళ్ళు ఏ ప్రాభ్లం రాదు.
7:34 పూర్వాహ్నం వద్ద జనవరి J, 2010 |
భాయి .. పర్సనల్ కామెంట్స్ని నేను జనరల్ గా అప్రూవ్ చెయ్యను .. కాకపోతే నీకు ఎదురైన ప్రాబ్లం నాకూ ఎదురైంది కాబట్టి, నీ పక్కింటి వాళ్ళలాంటి వాళ్ళు ఇది చదివయినా బుద్ధి తెచ్చుకొంటారని ఆశిస్తున్నా.. అందుకే అప్రూవ్ చేశాను!!
అది పక్కకు బెడితే .. నువ్వు నేను రాసింది సరిగా చదివినట్టు లేవు .. మా మీద నమ్మకం ఉంది కాబట్టే మా దోస్తులు మమ్మల్ని ఇక్కడ ఉండమంటున్నారు, వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది కనుకే మేము ఇంకా అక్కడ ఉన్నాం.
నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే చెయ్యి లేపానన్నావు .. ఇంకొందరు ఇంకొక లెవెల్ పైకి వెళ్లి ఆంధ్ర అన్న మాట వినిపిస్తే చెయ్యి లేపుతున్నారు .. మాకు నమ్మకం లేనిదల్లా ఇలా అందరినీ ఒక గాట కట్టి చెయ్యి లేపే వాళ్ళ మీద కానీ మా గురించి తెలిసిన వాళ్ళ మీద కాదు.
ఇటువంటి వాళ్ళు ఎవరు చెప్పిన వినరు. నువ్వు లాజికల్ గా ఆలోచించగలవని నమ్ముతున్నాను కాబట్టి చెప్తున్నా ..
నేను పర్సనల్ అనుభవాల నుంచి మనుషులు మంచి వాళ్ళని చెప్పే ప్రయత్నం చేస్తే నువ్వు నీ పర్సనల్ అనుభవాల నుండి మనుషులు చెడ్డ వాళ్ళని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. ఎవరు దగ్గరకు వచ్చినా అక్కున చేర్చుకున్న తెలంగాణ స్పూర్తికి ఇది విరుద్ధం.
ఇక్కడి భాషను, ప్రజలను అవమానించే రోగం కొందరికి చాలా రోజులనుంచి ఉన్నదే .. అటువంటి వాళ్ళను చూసి తెలుగు వాళ్ళంతా ఇంతే అని ప్రగతిశీల మార్గం నుండి వాళ్ళ స్థాయికి దిగజారుతానని అనడం మనలని మనం మోసం చేస్కోవడమే. ఒక భాషకున్న అనేక రూపాంతరాలలో ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనుకోవడం మూర్ఖత్వం .. నిజానికి స్వచ్చమైన తెలుగు పాఠ్య పుస్తాల్లో, ఇట్లాంటి బ్లాగుల్లో తప్పించి వాడుకలో ఎక్కడా కనిపించదు .. తెలంగాణ యాసలో మాట్లాడానికి నేను ఏ రోజు సిగ్గుపడలేదు … మన భాష మీద గౌరవం, ఆత్మాభిమానం 90% మన నుంచి రావాలి. ఈ సంకుచిత భావాలు వదలి తెలంగాణ అభివృద్దికి ఏమి చేయగలనని అలోచిస్తావని ఆశిస్తున్నా!!
ద్వేషంతో, హింసతో సాధించుకొనే తెలంగాణ అనుక్షణం సమస్యలు ఎదుర్కొంటుంది (నీరు, ఎగుమతులు, వ్యాపార సంబంధాలు.. ఏదైనా కావచ్చు) .. అదే అందరికీ వాస్తవాలు వివరించి ఒప్పించి సాధిస్తే మన సమస్యలు మరింత తేలికగా సాల్వ్ అవుతాయి.
ఉద్యమంలో ద్వేషాన్ని, హింసను నింపి కేంద్ర స్థాయిలో దానికి వ్యతిరేకత తీసుకురావాలన్న కుట్రకు నీ బోటి తెలంగాణ కిశోరాలు తెలిసో తెలియకో హెల్ప్ చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ మీద నమ్మకం లేకపోతే మనకు అరాచక మూకలకు తేడా లేదు. అవకాశం వచ్చిన ప్రతి వేదిక మీద తెలంగాణ డిమాండ్ ఎందుకు న్యాయమయిందో చెప్దాం, ప్రతి సమైక్యవాదికీ వాస్తవాలు వివరించి మారుద్దాం .. అంతే తప్పించి అభిప్రాయాలు చెప్పినందుకు తంతాను అంటే అది తెలంగాణ లక్ష్య సిద్ధికి వ్యతిరేకంగా పని చేస్తుంది .. మన రాజ్యాంగం అటువంటి వాటికి అంగీకరించదు కూడా.
11:27 పూర్వాహ్నం వద్ద జనవరి J, 2010 |
@కోర్రమట్ట , రవిచంద్ర, అబ్రకదబ్ర, సామాన్యుడు : కృతఙ్ఞతలు!! విజ్ఞత, వివేకం, ప్రగతిశీల ధృక్పథాలు తెలంగాణను ముందుకు నడిపిస్తాయని ఆశిద్దాం.